తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని ప్రారంభించడమే తమ లక్ష్యమని వైయస్ షర్మిల చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలోనే తెలంగాణలో ఆమె రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. దీని వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి హస్తం ఉందంటూ ఇప్పటికే పలువురు విపక్ష నేతలు ఆరోపించారు. తాజాగా ఈ అంశంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్యం అవసరం లేదని, రామరాజ్యం కావాలని అన్నారు. అయితే, కొత్త పార్టీ పెట్టబోతున్న సందర్భంగా షర్మిలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై అరవింద్ విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లా హాలియా సభలో ప్రసంగించిన కేసీఆర్… దివంగత ఎమ్మెల్యేకు కనీసం సంతాపాన్ని కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. కేసీఆర్ అహంకార వైఖరికి ఇది నిదర్శనమని చెప్పారు. ఎన్నికలకు ముందు హామీలను ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని మర్చిపోవడం కేసీఆర్ కు అలవాటేనని చెప్పారు. గిరిజన మహిళల పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.