హైదరాబాద్ : ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి… రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో పోటీ చేద్దామా? సీఎం పదవికి రాజీనామా చేసి నాతో పోటీ చేయాలి’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. నీ సిట్టింగ్ స్థానం మల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందాం రావాలన్నారు. సేఫ్ గేమ్ వద్దు… డైరెక్ట్ ఫైట్ చేద్దామని సూచించారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇలా సవాల్ చేసి పారిపోయారని గుర్తు చేశారు.
కొడంగల్ అసెంబ్లీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సవాల్ చేసి పారిపోయారన్నారు. సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటకు విలువ ఏముంటుంది? తనది మేనేజ్‌మెంట్ కోటా అయితే.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీది ఏ కోటా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా.. డబ్బులిచ్చి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. పేమెంట్ కోటా కాబట్టే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పేమెంట్ చేయాలన్నారు. బిల్డర్లు, వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి రేవంత్ కప్పం కట్టాలన్నారు. ఆయన విధించే సెస్‌పై త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రోడ్డెక్కుతారన్నారు.
రేవంత్ రెడ్డి తన శక్తిసామర్థ్యాలను ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మగాడైతే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రేపు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మేడిగడ్డ పర్యటన
బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం మేడిగడ్డ పర్యటనకు వెళుతుందని కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజీ వద్ద పర్యటిస్తామన్నారు. రోజుకు 5వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు. నీటి పారుదల నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకు వెళతామన్నారు.