వెలిగొండ సభలో దళిత నాయకులను జగన్ వేదికపై నుండి దించేయడం నేరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దుయ్యబట్టారు. జగన్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. తన పక్కన దళితులు కూర్చుంటే ఆయనకు గిట్టదు అని వెల్లడించారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెలిగొండ సభలో వైసీపీ ఇన్ ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్, మంత్రి ఆదిమూలపు సురేశ్ లను వేదిక పైనుంచి కిందికి పంపేశారని వర్ల రామయ్య ఆరోపించారు. ఆ కుర్చీల్లో తన వర్గీయులైన వైవీ సుబ్బారెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలను కూర్చోబెట్టారని వెల్లడించారు.
“జగన్ పక్కన దళితులు కూర్చోవడం ఇష్టం లేకనే ఆదిమూలపు సురేశ్, తాడిపత్రి చంద్రశేఖర్ లను లేపి కిందికి పంపారు. గతంలో డిప్యూటీ సీఎం పినిపే విశ్వరూప్ ని సభలో మోకాళ్లపై కూర్చోబెట్టారు. మరో సభలో అందరూ కుర్చీలలో కూర్చుని ఉండగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి అందరికన్నా వెనుక చేతులు కట్టుకొని నిల్చొనేలా చేశారు.
దళితులను వేదిక దిగిపోండని ముఖ్యమంత్రి అనటం చట్టరీత్యా నేరం. వెలిగొండ సభ వేదిక పై నుండి దళిత నాయకులను దించేయడంపై కేసు నమోదు చేయాలి. జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేయాలి” అని కోరారు.
జగన్ కు దళితులంటే అస్సలు పడదు
జగన్ కు రాష్ట్రంలోని దళితులంటే అస్సలు పడదు. దళితులు వద్దు గానీ దళితుల ఓట్లు మాత్రం జగన్ కు కావాలి. దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి దళితులను అడుగడుగునా ఇబ్బందులపాలు చేస్తున్నాడు. ఇంతగా దళితులను ఈసడించుకుంటున్నా దళితుల్లో చైతన్యం కొరవడింది.
దళితులంటే జగన్ కు ఎందుకింత వ్యతిరేకత, అసూయ, ఈసడింపు? ఇంతగా ఈసడించుకుంటున్నా, అవమానాలపాలు చేసినా వైసీపీ దళిత నాయకులు జీ హుజూర్ అంటున్నారు. ఈ సంఘటన పట్ల ఎస్సీ ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేయాలి. ఈ సంఘటన పట్ల జగన్ దళితులకు సమాధానం చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ సోనీ ఉడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు
‘దళితుడిగా బాధపడుతున్నానని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ సోనీ ఉడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ కమిషన్ మెంబర్ గా ఎందుకన్నా ఉన్నానని బాధను వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రభుత్వంలో చలనం లేదు….’ అంటూ వర్ల రామయ్య వివరించారు.