మరికొన్ని నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో బాటు ఆంధ్రప్రదేశ్ శాసన సభకూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి ఓటర్ల మూడ్‌ను తెలుసుకునేందుకు అనేక సర్వే సంస్థలు రంగంలో దిగాయి. ఈ క్రమంలో ఏపీలో సర్వే చేపట్టిన పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ సంస్థ తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా నిలిచింది. ముఖ్యంగా అధికార వైసీపీకి ఈ సర్వే ఫలితాలు నిద్రపట్టనీయకుండా చేస్తున్నాయి. వచ్చే ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, తెలంగాణలో మాదిరిగా ఏపీలో అధికార బదిలీ తప్పదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల తర్వాత వచ్చిన ఈ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది.
ఫిబ్రవరి రెండవ వారం నుంచి 29 మధ్య చేపట్టిన ఈ సర్వేకోసం రాష్ట్రంలోని 175 సెగ్మెంట్ల నుంచి 53,000 మంది అభిప్రాయాలను సేకరించామని, సర్వేలో పాల్గొన్నవారిలో 54 శాతం మంది పురుషులు, 46 శాతం మహిళలు ఉన్నారని వివరించింది. ఇక ఈ సర్వే ఫలితాలను పరిశీలిస్తే ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన కూటమి 104 స్థానాలను గెలుచుకుంటుందని, అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం 49 సీట్లకే పరిమితం కానుందని వెల్లడించింది.
ఈసారి 22 అసెంబ్లీ సెగ్మెంట్లలో హోరాహోరీ పోరు సాగనుందని, మొత్తం 25 లోక్‌సభ సీట్లలో టీడీపీ-జనసేన కూటమికి 18 స్థానాలు దక్కనున్నట్లు సర్వే లెక్కతేల్చింది. రానున్న ఎన్నికల్లో కూటమి 51.5 శాతం ఓటు షేర్‌ను పొందనుందని, వైసీపీ మాత్రం 42.6 శాతానికి పరిమితం కానుందని వెల్లడించింది. షర్మిల రాకతో కాంగ్రెస్‌లో కొంత కదలిక వచ్చిందన్న వార్తలను బలపరుస్తూ, అక్కడ కాంగ్రెస్ పార్టీకి 3 శాతం ఓట్లను గెలుచుకోనుందని, బీజేపీ 1.3 శాతం, ఇతరులకు 1.4 శాతం ఓట్లు దక్కవచ్చని అంచనావేసింది. శ్రీకాకుళం – నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని, రాయలసీమలో అనంతపురంలోనూ ఇదే పరిస్థితి ఉందని, మిగిలిన సీమ జిల్లాల్లో ప్రభుత్వం పట్ల తటస్థ భావన ఉందని వెల్లడించింది.
లోక్‌సభ స్థానాల వారీగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ ఏ స్థానాల్లో వైసీపీ ఆధిక్యం ఉంటుందనే అంశాన్ని కూడా సర్వే వెల్లడిచేసింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం ఎంపీ పరిధిలోని నరసన్నపేట, విజయనగరం ఎంపీ సీటు పరిధిలోని చీపురుపల్లి, గజపతినగరం, అరకు సీటు పరిధిలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, అనకాపల్లి సీటు పరిధిలోని మాడుగుల సీట్లలో వైసీపీ హవా ఉన్నట్లు అంచనావేసింది. ఇక దిగువకు వస్తే, కాకినాడ సీటు పరిధిలోని తుని, రాజమండ్రి సీటు పరిధిలోని అనపర్తి, విజయవాడ పరిధిలోని తిరువూరు, మచిలీపట్టణం పరిధిలోని గుడివాడ, బాపట్ల సీటు పరిధిలోని బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్, ఒంగోలు పరిధిలోని యర్రగొండపాలెం, కొండెపి, నెల్లూరు పరిధిలోని కందుకూరు, కోవూరు, ఉదయగిరిలో వైసీపీ హవా కనిపించింది.
రాయలసీమలోని తిరుపతి ఎంపీ సీటు పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సత్యవేడు, చిత్తూరు సీటు పరిధిలోని చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, రాజంపేట పరిధిలోని కోడూరు, రాయచోటి, మదనపల్లె, పుంగనూరు, కడప పరిధిలోని అన్ని సీట్లు, నంద్యాల సీటు పరిధిలోని ఆళ్లగడ్డ, పాణ్యం, కర్నూలు సీటు పరిధిలోని పత్తికొండ, కోడుమూరు, మంత్రాలయం, ఆలూరు, అనంతపూర్ సీటు పరిధిలోని శింగనమల అసెంబ్లీ సీట్లలో వైసీపీ ఆధిక్యంలో ఉంది.