భద్రాద్రి జిల్లా / మణుగూరు/ కరకగూడెం: మండలానికి ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు. ప్రభుత్వానికి పని చేశామా లేదా. అక్రమాలను అడ్డుకున్నామా లేదా..! అన్నది ముఖ్యమైన అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల తహసీల్దార్ నాగప్రసాద్. కరకగూడెం మండల తహసీల్దార్‌గా పదవి భాద్యతలు స్వీకరించి మూడు రోజులు కాకముందే అక్రమాలపై కొరడా విధిస్తున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. మండలంలో ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని శాఖలను అకస్మాత్తుగా సందర్శించి పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా పర్యవేక్షణ చేశారు. అయితే మండలంలో ఉన్న కస్తూర్బా గిరిజన బాలికల పాఠశాలను గత రెండు రోజులగా పర్యవేక్షిస్తున్నారు.
బాలికలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా పరీక్షించారు. ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయనా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కస్తూర్బా గిరిజన బాలికల పాఠశాల ముందు బెల్ట్‌షాప్‌లు ఎక్కువగా ఉన్నాయని కొందరి ద్వారా సమాచారం తెలుసుకొని ఆదివారం రాత్రి బెల్ట్ షాప్‌ను తనిఖీ చేశారు. ఒక రైతుగా పంచకట్టు కట్టుకొని బెల్ట్ షాప్‌లోకి వెళ్లారు. లోపల చూస్తే కొందరు వ్యక్తులు విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు. గిరిజన బాలికల పాఠశాల ముందు విచ్చలవిడిగా బెల్ట్‌షాప్‌లు ఎలా ఏర్పాటు చేశారని అక్కడ ఉన్న కొందరిని అడిగి తెలుసుకున్నారు.
విద్యాలయాలు, ప్రార్థన మందిరాల చుట్టూ మద్యం విక్రయిస్తే అటువంటి వ్యక్తులపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్ధరాత్రి ఒక రైతుగా వచ్చి బెల్ట్‌షాప్ లు తనిఖీ చేయడాన్ని గమనించిన ప్రజలు శభాష్ తహసీల్దార్ అంటూ అభినందిస్తున్నారు. ఈలాంటి తహసీల్దార్‌ను ఎన్నడూ చూడలేదని అంటున్నారు. తహసీల్దార్ ఒక రైతుగా పంచ కట్టుకుని బెల్ట్ షాప్ తనిఖీ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది.