మాదిగలను రెచ్చగొడితే అందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్‌లా సీఎం రేవంత్ రెడ్డి తమకు అన్యాయం చేస్తే ప్రత్యక్ష యుద్ధం ఉంటుందని… మాదిగల తిరుగుబాటు ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూపిస్తామన్నారు.
శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాదిగలు తనకు రాజకీయంగా అండగా నిలిచారని రేవంత్ రెడ్డి చెబుతుంటారని… మరి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మాదిగలకు న్యాయం చేయాలని తాను అడిగితే… న్యాయం చేయకపోగా… తమ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తితో కౌంటర్ ఇప్పించారని మండిపడ్డారు.
కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి తప్పులు చేస్తే ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా పోతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్‌కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. తన నల్ల కండువా ఎప్పుడూ మారలేదని… కానీ రేవంత్ రెడ్డి మెడలో ఎన్ని కండువాలు మారాయో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. సంపత్ కుమార్‌కు టిక్కెట్‌పై ఢిల్లీకి వెళదామని చెప్పారని… కానీ చివరకు ద్రోహం చేశారని ఆరోపించారు. నాగర్ కర్నూల్ లోక్ సభ సీటును సంపత్ కుమార్‌కు కాకుండా మల్లు రవికి ఎందుకు ఇప్పించారో చెప్పాలన్నారు.
నిన్న సంపత్ కుమార్ మాట్లాడిన మాటలు ఆయన మనస్సులో నుంచి వచ్చినవి కావన్నారు. రేవంత్ రెడ్డి చిలుక పలుకులు సంపత్ నోట వచ్చాయని ఎద్దేవా చేశారు. సంపత్ ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. తాను బీజేపీకి మద్దతిస్తున్నాననే కారణంతో… మాదిగజాతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్ల దగ్గర తాను ఉంచానని సంపత్ కుమార్ చెప్పడం సరికాదన్నారు. అంతకుముందు వైఎస్ రాజశేఖరరెడ్డికి కూడా మద్దతిచ్చానని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు సహకారం అందించేవారికి మద్దతిస్తానన్నారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు మాదిగలు ఆయనకు మద్దతివ్వలేదా? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు నిలబడితే ఆమెను గెలిపించేందుకు నేను మద్దతిచ్చాను… అంటే ఆయా సందర్భాలలో మా జాతిని వారి కాళ్ల వద్ద పెట్టినట్లు అవుతుందా? అని మండిపడ్డారు. తనకు రేవంత్ రెడ్డి నుంచి సమాధానం రావాలని డిమాండ్ చేశారు. తన ప్రతి గెలుపులో మాదిగల పాత్ర ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు టిక్కెట్‌ను ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. రేవంత్ ఇప్పటికైనా మాదిగల రుణం తీర్చుకోవాలన్నారు.