శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం : ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పక్కాగా నిర్వహిస్తున్నామని, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఇచ్చాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సుదర్శన్ దొర కోరారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 4 మండలాలు ఒక మున్సిపాలిటీ పరిధిలోని 299 పోలింగ్ స్టేషన్స్ ఉండగా, 2, 62,126 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని,ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏప్రిల్ 15వ తేదీ వరకు ఓటర్ నమోదు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు పరిశీలన, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇతర బృందాలు ఇప్పటికె ఏర్పాటు చేయగా వారు విధుల్లో ఉన్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు కొరకు బృందాలు 24 గంటల పాటు విధుల్లో ఉంటున్నాయని తెలిపారు. 200 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు నియోజకవర్గంలో నాలుగు చోట్ల ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు లెక్కలు లేని సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు నగదు స్వాధీనం చేసుకున్నామని, ప్రజలు తాము తీసుకువెళ్లే నగదుతో సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, తమ తనిఖీలకు సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీలు తమ ప్రచారాలు సమావేశాల కోసం ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదు చేయదలచిన వారు ఇచ్చాపురం తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చునని తెలిపారు. కంట్రోల్ రూమ్ సంప్రదించేందుకు ఫోన్ నెంబర్ 9114115363 కు సంప్రదించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చిన, తప్పుడు ఫిర్యాదు చేసిన ఎన్నికల నియమావలి ప్రకారం తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇచ్చాపురంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.