- చెన్నూరు పట్టణ కేంద్రంలో అనవసర కరెంటు కోతలు
- రాత్రింబవళ్ళు తేడా లేకుండా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్న అధికారులు
- అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు
మంచిర్యాల జిల్లా,చెన్నూరు:పట్టణ కేంద్రంగా కరెంటు కోతలతో ప్రజలను కన్నీళ్లు అధికారులు పెట్టిస్తున్నారు. అవసరం లేనప్పటికీ రాత్రింబవళ్ళు తేడా లేకుండా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. వేసవి కాల నేపథ్యంలో ఓ పక్క ఎండలు మండిపోతుంటే సంబంధిత అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తుండగా ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. రోజులో దాదాపు ఆరు గంటలు కరెంటు కోతలు విధిస్తున్నారని, మధ్యరాత్రి కూడా కనికరం లేకుండా విద్యుత్తు సరఫరా నిలివేస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే పొంతన లేని సమాదానాలు చెప్తూ, అధికారులు చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తుండగా, గత పది రోజులుగా పెరిగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అనవసరంగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తే విధుల నుండి బహిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించినప్పటికీ, ఆయన హెచ్చరికలను పెడచెవిన పెట్టి విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్న అధికారులపై స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ చర్యలకు పూనుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని తమ ధోరణి మార్చుకొని, కరెంటు సరఫరాలో నిర్లక్ష్యం వహించవద్దని స్థానికులు సూచిస్తున్నారు.