పల్నాడు జిల్లా, కారంపూడి : తల్లిదండ్రుల ఆశలు పిల్లలుగా పుడతారన్న కనీస ధర్మాన్ని మరచిన ఓ కసాయి తండ్రి కూతురు నల్లగా పుట్టిందని ముక్కు నోరు మూసి గాలాడకుండా హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పేటసెన్నేగండ్ల గ్రామంలో నివాసం ఉంటున్న మన్నెం మహేష్ కు మూడు సంవత్సరాల క్రితం ఈపూరు మండలం బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన చీదా నాగేశ్వరరావు, అంకాలమ్మ దంపతుల చిన్న కూతురు శ్రావణిని ఇచ్చి వివాహం చేశారు. వీరికి 18 నెలల క్రితం అక్షయ అనే చిన్నారి జన్మించింది. చిన్నారి నల్లగా పుట్టిందని భర్త అత్తమామలు దగ్గరికి రానిచ్చేవారు కాదు, అయినప్పటికీ శ్రావణి వాళ్లే మారుతారులే అని సర్దుకు పోయింది. గత నెల అనగా మార్చి 30 తారీకున గ్రామ సరిహద్దుల్లోని దేవాలయానికి వెళ్ళిన అత్త మామ అక్కడి నుంచి అన్నని తీసుకొచ్చారు. రాత్రివేళ అందరూ అన్నం తిని శ్రావణి కి మాత్రం పులిహార పెట్టారు. ఇది తిన్న తల్లి తన చంటి బిడ్డను పక్కన పెట్టుకుని నిద్రలోకి జారుకుంది. తెల్లవారుజామున పొత్తిళ్లలోని బిడ్డ ముక్కు వెంట రక్తం కారుతూ అపస్మారక స్థితిలో కనిపించడంతో మంచం పై పడుకున్న భర్త మహేష్ కు అత్త మామ కొండలు, నాగమల్లేశ్వరులకు విషయం తెలిపింది. భర్త ద్విచక్ర వాహనం తీసుకురావడంతో చిన్నారిని తీసుకొని కారంపూడి లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొనడంతో కన్నీరు మున్నేరుగా విలపించింది. మృతదేహాన్ని తీసుకొని భర్తతో కలిసి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో తమ కూతురు ఫిట్స్ తో చనిపోయిందని బంధువులకు చెప్పాలని భర్త ఆదేశించాడని, ఒకపక్క నిద్ర మత్తు, మరోపక్క కూతురు మృతితో ఏమీ అర్ధం కాని శ్రావణి మాట్లాడకుండా ఉంది. బంధువులకు చిన్నారి మృతి విషయం తెలిపిన మహేష్ హుటాహుటిన ఆమెకు ఖనన కార్యక్రమాలను జరిపాడు, అనంతరం బంధువులందరూ వెళ్లిపోగా శ్రావణి తల్లి అంకాలమ్మ కూతురి దగ్గరకు తిరిగి వచ్చింది. శ్రావణి ఆమె తల్లిపై నిఘా పెట్టిన ఆమె భర్త కుటుంబ సభ్యులు ఫోను సైతం మాట్లాడనివ్వకుండా చేయడంతో అనుమానం వచ్చిన వారి బంధువులు పెద్ద మనుషుల ద్వారా పంచాయతీ పెట్టారు. దీంతో శ్రావణి బుధవారం అసలు విషయం బయట పెట్టింది. తన భర్త మహేష్ గతంలో రెండు దఫాలుగా అక్షయ నల్లగా ఉందని ఆగ్రహంతో హత్య చేసేందుకు ప్రయత్నించాడని, తన కూతురి మృతి పై అనుమానంగా ఉందని చెప్పడంతో విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న కారంపూడి సీఐ చిన్న మల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం గుంటూరు నుంచి వైద్యులను రప్పించి మృతదేహాన్ని ఎస్పై రామాంజనేయులు సమక్షంలో పోస్టుమార్టం చేశారు. తన భర్త మహేష్ తన కూతురిని చంపేదని గతంలో సైతం గోడకు ఒకసారి విసిరికొట్టి గదిలో పడేసి తాళం వేశాడని, మరోసారి నీళ్ల తొట్టిలో ముంచాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె కన్నీటి పర్యంతమై వేడుకుంటుంది.