మంచిర్యాల: జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. 3.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షానికి రైతులకు అపార నష్టం వాటిల్లింది. పలు మం డలాల్లో కోతకు వచ్చిన మామిడి నేలరాలగా, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కాంటా వేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు పంపాలని, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తరువాత కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. తడిసిన పంట నష్టం అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
నస్పూర్: నస్పూర్‌లో భారీ గాలులతో వర్షం కురిసింది. తాళ్ళపల్లి పున రావాస కాలనీ సమీపంలో 11కేవి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై చెట్టు పడడంతో విద్యుత్ స్తంభం విరిగి ట్రాన్స్‌ఫార్మర్ కిందపడింది. అల్లూరి సీతారామరాజు నగర్‌లో విద్యుత్ వైర్లపై చెట్టు పడడంతో విద్యుత్ స్తంభం విరిగిపడిపోయింది. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. విద్యుత్ అధికారులు, సిబ్బంది మరమ్మతు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సత్వరమే మర మ్మతు పూర్తి చేసి సరఫరా ఇస్తామని ఏఈ రాంమూర్తి తెలిపారు.
భీమారం: మండలంలో గాలి దుమారంతో వడగండ్ల వర్షం కురిసింది. చేతికొచ్చిన వరి పంట నేలమట్టం కాగా కోత దశలో ఉన్న మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేం దుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ కవర్లు లేక ఇండ్లలో నుంచి కవర్లు తెచ్చి కప్పినా ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కాంటా వేసి పదిహేను రోజులు గడుస్తున్నా తరలించకపోవడంతో తడిసిపో యింది.నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
చెన్నూరు: మండలంలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం పడింది. లంబడిపల్లి, లింగంపల్లి, అక్కెపల్లి, అంగ్రాజ్‌పల్లి, కిష్టంపేట తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు కవర్లు కప్పారు. కొన్ని చోట్ల కవర్లపై నీరు చేరి ధాన్యం తడిసిపోయింది. వర్షం నీరు చేరడంతో రైతులు నీటిని ఎత్తిపోశారు.
జైపూర్: కుందారం, కిష్టాపూర్, పౌనూరు, వేలాల, శివ్వారం గ్రామాల్లో ఈదురుగాలులతో వడగండ్ల వాన పడింది. రోడ్లుపై ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఈదురుగాలులతో చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో అంతరాయం ఏర్పడిం ది. ఈదురుగాలులకు మామిడికాయలు రాలిపోయాయి.
తాండూర్: మండలంలో ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో వడగండ్ల వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు వర్షం పడడంతో మామిడికాయలు నేలరాలాయి. నీలాయపల్లి, అచ్చలాపూర్ గ్రామాల్లో విద్యుత్ వైర్లపై చెట్లు విరిగి పడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు చేసి విద్యుత్‌ను పునరుద్దరించారు.
కన్నెపల్లి: మండలంలో కురిసిన గాలివానకు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలోని స్టేజ్ రేకులు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. రేకులు విద్యుత్ వైర్ల పై పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మండలంలో పలు చోట్ల చెట్లు విరి గిపడ్డాయి. మెట్‌పల్లిలో విద్యుత్ స్తంభం విరిగి పడింది.