ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు భారీ ఓటింగ్ శాతంతో రాష్ట్రంలో ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుకుంటే ఎన్నికల హింసతో రాజకీయ నేతలు, దాన్ని అరికట్టడంలో విఫలమై అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎస్, డీజీపీలను స్వయంగా ఢిల్లీకి పిలిపించి వివరణ తీసుకున్న ఈసీ.. హింసకు బాధ్యుల్ని చేస్తూ ముగ్గురు ఎస్పీలు, ఓ కలెక్టర్ పైనా వేటు వేసింది.
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులోని మాచర్ల, గురజాల, నరసరావుపేట, రాయలసీమలోని తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో భారీగా హింస చెలరేగింది. దీన్ని అరికట్టడంలో అక్కడి అధికార యంత్రాంగం విఫలమైందని ఈసీ భావించింది. దీంతో ఇవాళ ఢిల్లీకి సీఎస్, డీజీపీలను పిలిపించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరికలు చేసింది. అన్ని జిల్లాల ఎస్పీలను ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని సూచించింది. ఎన్నికల కోడ్ ముగిసేలోపే హింసకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని సీఎస్, డీజీపీలకు అక్కడే ఆదేశాలు ఇచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సిఫార్సుల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం, తిరుపతి జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు వేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ మూడు జిల్లాల్లో 12 మంది కింది స్దాయి పోలీసు అధికారులపైనా చర్యలకు ఆదేశించింది. వీరిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
తిరుపతి, పల్నాడు, అనంత జిల్లాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న పోలీసు అధికారుల సస్పెన్షన్:
విచారణను పూర్తి చేసి రెండు రోజుల్లో నివేదికివ్వాలని ఈసీ ఆర్డర్…
సస్పెండైన పోలీస్ అధికారులు..:
- తిరుపతి డీఎస్పి సురేందర్ రెడ్డి.
- ఎస్బీ సిఐ రాజశేఖర్.
- ఎస్బీ డీఎస్పీ భాస్కర్ రెడ్డి.
- అలిపిరి సీఐ రామచంద్ర రెడ్డి.
- నరసరావుపేట డీఎస్పీ బిఎస్ఎన్ వర్మ.
- గురజాల డీఎస్పి పల్లపురాజు.
- ఎస్బీ సీఐ ప్రభాకర్ రావు.
- ఎస్బీ సీఐ బాలనాగిరెడ్డి
- కారంపూడి ఎస్సై రామాంజనేయులు.
- నాగార్జునసాగర్ ఎస్ఐ కొండారెడ్డి.
- తాడిపత్రి డీఎస్పీ గంగయ్య.
- తాడిపత్రి సీఐ మురళీకృష్ణ