ఏపీలో వాలంటీర్లకు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను ఇంటికి పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి గ్రామ వాలంటీర్ సచివాలయం, వార్డు వాలంటీర్ సచివాలయం శాఖ డైరెక్టర్, కమిషనర్ జీఎస్. నవీన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 35 ఏళ్లు దాటిన వాలంటీర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇలా ముణ్ణాల ముచ్చటగా మిగిలిపోతున్నాయని తెలిసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.జగన్ ప్రభుత్వం నవరాత్నాల అమలులో భాగంగా… గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారిని గ్రామ వాలంటీర్లుగా రిక్రూట్ చేసింది. 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రంలో 2 లక్షల 60 వేల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. అయితే వాలంటీర్ల నియామకంలో.. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలు ఉల్లంఘించారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అధికార వైసీపీ గ్రామ, మండలస్థాయి నేతలతోపాటు ఎమ్మెల్యేల సిఫార్సులతో నియమితులైన వారే అధికమని విమర్శలు చెలరేగాయి.అయితే కొన్నాళ్లుగా 35 ఏళ్లు నిండిన వాలంటీర్లకు CFMS సిస్టమ్ ద్వారా అందాల్సిన జీతాలు రావడంలేదు. ఇది కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 35 ఏళ్లుపైబడి ఉన్నవారిని సాగనంపేదుకు చర్యలు తీసుకున్నారు. ఇలా ప్రతి జిల్లాలోనూ వాలంటీర్ల సంఖ్య వందల్లో ఉంటుందని అంచనా. ప్రభుత్వ తాజా ఉత్వర్వుతో వాళ్లంతా రోడ్డుపై పడబోతున్నారు. తొలగించిన వారి స్థానంలో.. ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు కూడా చేపట్టాలని ఉత్వర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంతో 35 ఏళ్లు దాటిన వాలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది… జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో… ప్రభుత్వం ఇలా షాక్ ఇవ్వడంతో తీవ్ర వేదనకు గురవుతున్నారు.