సమ్మక్క – సారలమ్మను చదువుకున్న వారు, వ్యాపారవేత్తలు కూడా దర్శించుకోవడం ఏంటంటూ చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా స్పందించారు. ”ఓ ఆంధ్రా చినజీయర్ స్వామి.. మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకలైన మా సమ్మక్క-సారలమ్మపై ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారు? చినజీయర్ స్వామి తెలంగాణ, ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి.
ఆదివాసుల ఆత్మగౌరవానికి ప్రతీకైన, తెలంగాణ బిడ్డల కోరికలు తీర్చే సమ్మక్క-సారలమ్మల జాతర మేడారం జాతర. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర ఇది. ఈ జాతర వైభవాన్ని, దేవతల కీర్తిని తగ్గించేలా చేసిన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మా దేవతలు ప్రకృతి దేవతలు.. అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారమూ జరగదు. దేవతలను చూడాలంటే టికెట్లు ఉండవు. మీరు 120 కిలోల బంగారంతో చేసిన సమతామూర్తిని నిర్మించుకుని, దాన్ని చూడడానికి రావాలంటే రూ.150 టికెట్టు పెట్టి, వ్యాపారం చేస్తున్నారు.
మేడారంలో మాత్రం ఇటువంటి వ్యాపారాలు ఉండవు. చినజీయర్ స్వామి తల్లుల కీర్తిని దిగజార్చేలా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి దుర్మార్గ విధానాలపై సర్కారు వైఖరి ఏంటో తెలియజేయాలి” అని సీతక్క డిమాండ్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.