ఇండియా తో నిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా మరో భారీ కుట్రకు తెరలేపింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని భారత సరిహద్దుకు అతి దగ్గరగా మూడు గ్రామాలను నిర్మించింది. ఇప్పుడు వాటిని అడ్డం పెట్టుకుని భారత భూభాగంలోని 65 కిలోమీటర్ల మేర తమదేనని వాదించేందుకు, మెక్‌మెహన్ రేఖ చట్టబద్ధతను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. బూమ్ కనుమకు 5 కిలోమీటర్ల దూరంలోని కొండ ప్రాంతంలో నిర్మించిన ఈ గ్రామాల్లో ఇంటర్నెట్ సహా అన్ని వసతులు కల్పించడం గమనార్హం. హన్ చైనీయులు, టిబెట్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన పశుపోషకులను ఈ గ్రామాలకు తరలించింది.భారత్, చైనా బలగాల మధ్య 2017లో డోక్లాం ప్రతిష్ఠంభన కొనసాగిన ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలో భూటాన్ భూభాగంలో కొన్ని గ్రామాలను ఆక్రమించి మరీ చైనా ఈ దుస్సాహసానికి పూనుకున్నట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. కొండలపై ఇళ్ల నిర్మాణంలో చైనా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్టు వీటిని బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటి ఉపగ్రహ చిత్రంలో కొండలపై 20 ఇళ్లు కనిపించాయి. నవంబరు 28 నాటికి అవి 50కి పెరగ్గా తాజాగా, అక్కడ మరో 10 కొత్త కట్టడాలు కనిపించాయి. ఉపగ్రహ చిత్రాలను బట్టి అక్కడ కొత్తగా మూడు గ్రామాలను నిర్మించినట్టు తెలుస్తోంది.