మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. పథకం ప్రకారమే దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని టీడీపీ నేతలు కోరారు. డీజీపీని కలిసిన వారిలో బ్రహ్మారెడ్డితో పాటు దేవినేని ఉమ, వర్ల రామయ్య తదితరులు ఉన్నారు. అనంతరం బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… పిన్నెల్లి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్నారు.
పాల్వాయిగేటు ఘటనలో అన్నింటికి ఎమ్మెల్యేనే కారణమన్నారు. ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన శేషగిరిరావుపై రౌడీలతో దాడి చేయించడం దుర్మార్గమన్నారు. పోలింగ్‌కు ముందు… ఆ తర్వాత నియోజకవర్గంలో ఏ చిన్న ఘటన జరిగినా అందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు. దాడులు చేస్తామని పిన్నెల్లి ముందే చెప్పాడని… చెప్పిన విధంగా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులకు సవాల్ విసిరి… ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని మండిపడ్డారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు
మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. అన్ని విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120 బీ, ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఏ1గా కోర్టులో మెమో దాఖలు చేశారు.
హైదరాబాద్‌లో పిన్నెల్లి కోసం తెలంగాణ పోలీసులతో కలిసి ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారును గుర్తించారు. ఆయన కనిపించలేదు. కానీ పిన్నెల్లి డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం సాగింది. కానీ అరెస్ట్‌పై పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆ తర్వాత ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.