తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వారందరినీ దశాబ్ది వేడుకలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీతో సమావేశం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… జూన్ 2న జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా సోనియా గాంధీని కోరినట్లు చెప్పారు. వేడుకలకు రానున్న సోనియాకు… పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.
రాష్ట్రంలోని ప్రముఖులను, ఉద్యమకారులను ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రజాపాలనలో జరుపుకుంటున్న మొదటి ఉత్సవాలు కాబట్టి ఉద్యమకారులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. వారందరికీ సముచిత గౌరవం దక్కుతుందని హామీ ఇచ్చారు. కోదండరాం నేతృత్వంలో జాబితాను తయారు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియాను ఆహ్వానించినట్లు చెప్పారు. సోనియా రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయన్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీకి పాకిస్థాన్ గుర్తు వస్తుందని విమర్శించారు. పాకిస్థాన్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు ఎవరు వెళ్లారు? అని ప్రశ్నించారు. మోదీ పాక్ ప్రధానిని కౌగిలించుకున్నారన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చడం అంశాలను లేవనెత్తితే… బీజేపీకి పాకిస్థాన్ గుర్తుకు వస్తోందని మండిపడ్డారు.
పదేళ్ల దేశ పురోగతిని బీజేపీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాలన, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. డిపాజిట్లు రాని చోట మెజారిటీ సీట్లు వస్తాయని బీజేపీ గొప్పగా చెబుతోందని… కానీ మోదీ గ్యారెంటీ వారంటీ ఫినిష్ అయిందన్నారు. బీజేపీ మాటలు వినేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు బీజేపీని గద్దె దించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.