contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్… సబ్ రిజిస్ట్రార్, మరో 8 మందికి పై కేసు నమోదు

నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఒకరి భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న రిమాండ్‌కు తరలించారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్ట్ అయిన వారి సంఖ్య 8కి చేరింది.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు చెందిన సురావజ్జుల సత్యనారాయణ-స్వాతి దంపతులు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం శివారులోని గ్రాండ్ విల్లా వెంచర్‌లో సర్వే నంబర్ 225, 226లోని 1000 గజాల స్థలాన్ని రూ. 80 లక్షలకు కొనుగోలు చేశారు. అంతవరకు బాగానే ఉన్నా తొలుత రిజిస్ట్రేషన్, ఆ తర్వాత లింక్ డాక్యుమెంట్ల విషయంలో సాకులు చెబుతుండడంతో అనుమానించిన సత్యానారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణమైన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నగరానికే చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు, వీరపునేని మధుసూదన్ రావు లు మల్లవరపు అరుణ్‌కుమార్, మరో ఆరుగురితో కలిసి అక్రమాలకు తెరలేపారు.

అనుమానం బలపడిందిలా
సత్యనారాయణ దంపతులకు విక్రయించిన భూమి నిజానికి దుర్గ అనే పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉంది. దీంతో నిందితులు రాంనగర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళకు డబ్బులు ఎరవేసి ఆమె ఆధార్‌కార్డును మార్ఫింగ్ చేయించి దుర్గగా మార్చి రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకు తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ సనత్‌నగర్ రమణ సహకరించారు. ఈ క్రమంలో ఓ రోజు సత్యనారాయణ తన భూమి వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఈ భూమి తమదంటూ ఓ నంబరుతో బోర్డు కనిపించింది. అనుమానించిన సత్యనారాయణ ఆ నంబరుకు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ భూమి తమ అమ్మమ్మ దుర్గ పేరుపై రిజిస్టర్ అయి ఉందని, ఆమె ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని చెప్పడంతో తలతిరిగినంత పనైంది.

ఎస్పీని కలిసి ఫిర్యాదు
తాను మోసపోయానని, భూమి విక్రయం విషయంలో పలు అక్రమాలు జరిగాయని గ్రహించిన సత్యనారాయణ దంపతులు మెదక్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం జరిగిన విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. నిందితులు నకిలీ పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించారని, ఆ భూమి నిజంగానే దుర్గ పేరుపై రిజిస్టర్ అయి ఉందన్న విషయం తేలింది. అంతేకాదు, లింక్ డాక్యుమెంట్ల విషయంలో పొంతనలేని సమాధానాలు ఇచ్చిన నిందితులు అవి పోయినట్టు బాధితుడితోనే పోలీసులకు ఫిర్యాదు చేయించి ఎన్‌వోసీ సర్టిఫికెట్ తీసుకోవడం గమనార్హం.

మొత్తం 8 మందికి అరదండాలు
విచారణ అనంతరం పిట్ల సాయికుమార్, వేముల ప్రభాకర్, నంగునూరు లక్ష్మి, డాక్యుమెంట్ రైటర్ బాలకృష్ణ వారికి సహకరించిన తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ సనత్‌నగర్ రమణను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ముగ్గురిని గత నెలలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :