తిరుపతి, చంద్రగిరి డీఎస్పీ శరత్రాజ్కుమార్పై బదిలీ వేటుపడింది.వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి.తిరుపతిలోని మహిళావర్శిటీ ఇంజనీరింగు కళాశాలలో ఏర్పాటుచేసిన స్ర్టాంగ్ రూము వద్ద డీఎస్పీ శరత్రాజ్కుమార్ బుధవారం సాయంత్రం వుండగా ఆయన స్నేహితుడైన హోమియోపతి డాక్టర్ ఒకరు వచ్చారు.ఆయన్ను లోపలకు అనుమతించడమే కాకుండా కౌంటింగ్ హాల్లోకి నేరుగా తీసుకెళ్ళడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.ఈ విషయం తెలిసి జిల్లా ఎన్నికల అధికారి సీరియస్ అవడంతో వెంటనే డీజీపీ కార్యాలయానికి ఎస్పీ నివేదిక పంపారు.దీంతో డీఎస్పీని వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి.కాగా ఈ నెల 13వ తేది పోలింగు రోజు చంద్రగిరి మండలం కూచివారిపల్లె, రామిరెడ్డిపల్లెల్లో చోటు చేసుకున్న ఘర్షణలు, దాడులకు చంద్రగిరి పోలీసుల వైఫల్యమే కారణమని ఎన్నికల కమిషన్కు సిట్ బృందం రిపోర్టు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది పోలీసు అధికారులపై నేడో, రేపో వేటు పడే అవకాశం వుందని సమాచారం.