జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని, ఏపీ ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నేడు మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ వద్ద కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి సృష్టిస్తే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆయా అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఈ అంశాలను గమనించాలని అన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేశారు.
ఇక, పోస్టల్ బ్యాలెట్ అంశంలో సీల్ పై ఫిర్యాదు వచ్చిందని, ఆ ఫిర్యాదు నేపథ్యంలో సీల్-సంతకంపై స్పష్టత ఇచ్చామని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ విషయంలో అనుమానాలు నివృత్తి చేసేందుకే ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈసీ మరోసారి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు.