పాకిస్తాన్ ఎట్టకేలకు దిగి వచ్చింది. 26/11 ముంబై ఉగ్రదాడి నిందితులను మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. పాకిస్థాన్‌లోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) ఈ మేరకు పేర్కొంది. కరాచీకి చెందిన ఏఆర్ జెడ్ వాటర్ స్పోర్ట్స్ నుంచి యమహా మోటారు బోటు, లైఫ్ జాకెట్లు, పడవలను కొనుగోలు చేసినందుకు గాను ఫైనాన్షియర్లు, అల్ హుసేనీ, పడవ సిబ్బంది పేర్లును కూడా ఈ జాబితాలో చేర్చింది.ముహమ్మద్ అమ్జాద్ ఖాన్ బోటును కొనుగోలు చేయగా, ఉగ్రదాడి కోసం అల్‌ఫౌజ్ ఈ బోటును ఉపయోగించాడు. షాహిద్ గఫూర్ అలీ హుసేనీ ఈ పడవకు కెప్టెన్‌గా వ్యవహరించగా, మరో 10 మంది ఉగ్రవాదులను పడవలో ముంబై తీసుకెళ్లాడు.ఎఫ్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ముహమ్మద్ అమ్జాద్ ఖాన్, ఇఫ్తీఖర్ అలీ, షాహిద్ గఫూర్, ముహమ్మద్ సబీర్ సల్ఫీ, అబ్దుల్ రెహ్మాన్,అబ్దుల్ షకూర్, ముహమ్మద్ ఉస్మాన్,అతీక్-ఉర్-రెహ్మాన్, రియాజ్ అహ్మద్, ముహమ్మద్ ముష్తాక్, ముహమ్మద్ నయీమ్, ముహమ్మద్ ఉస్మాన్, షకీల్ అహ్మద్, ముహమ్మద్ ఉస్మాన్ జియా, ముహమ్మద్ అబ్బాస్ నాసిర్, జావేద్ ఇక్బాల్ ఉన్నారు. 2008 నాటి ఉగ్రదాడికి వీరంతా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. వీరంతా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన వారే.