ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై నేడు శ్వేతపత్రం విడుదల చేశారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మొన్నటి వరకు తమకున్న అరకొర సమాచారం ఆధారంగా రాజకీయ ఆరోపణలు చేశామని, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. పోలవరంపై ముందుకు వెళ్లేందుకు మేధావులు, నిపుణులు, మీడియా, వివిధ వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామని తెలిపారు.
“ఎన్నికల్లో ప్రజలు గెలిచారు… ఇప్పుడు రాష్ట్రాన్ని నిలబెట్టడం మనందరి బాధ్యత. బాధ్యతను తీసుకోవడానికి మేం వెనుకంజ వేయం. అదే సమయంలో ప్రజలు కూడా సహకరించాలి. అందుకే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. వీటిని 25 రోజుల వ్యవధిలో తీసుకువస్తాం. అన్నింటిపై చర్చలు పూర్తిచేసుకుని అసెంబ్లీ సమావేశాలకు వెళతాం. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అటు, లోక్ సభ సమావేశాల్లో ఆయా అంశాలకు సంబంధించి నిధులు సాధించుకోవాల్సిన అవసరం ఉంది.
నీటి పారుదల రంగానికి సంబంధించి మేం చేసే ప్రతి పనినీ డాక్యుమెంట్ల రూపంలో వెబ్ సైట్ లో పెడతాం. వాళ్లకు విశ్వసనీయత లేదు. ఏది చేసినా ఎదురుదాడి చేయడం వాళ్లకు అలవాటైపోయింది. చెప్పిన అబద్ధాలనే వందసార్లు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. దానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ తొలి శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం. వాళ్లకు ప్రజలే సమాధానం చెప్పే విధంగా ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యం తీసుకువస్తాం.
ఇవాళ మేం విడుదల చేసిన శ్వేతపత్రం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటిది పోలవరం, రెండోది ఇతర సాగునీటి ప్రాజెక్టులు. రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం ఎంతో ఉంది. 2014 నుంచి 2019 వరకు సాగునీటి ప్రాజెక్టులపై రూ.67 వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడైతే వాటి నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరించడంలేదు… ఈ కార్యక్రమంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి వివరిస్తాను.
రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. రాష్ట్రానికి రెండు ప్రధానమైన ప్రాజెక్టులు ఒకటి అమరావతి, రెండు పోలవరం. రెండు కూడా రెండు కళ్లు లాంటివి. ఈ రెండు పూర్తి చేసుకుంటే విభజన నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంటుంది. విభజన చట్టంలో పోలవరంకు జాతీయహోదా ఇచ్చారు. నదుల అనుసంధానానికి పోలవరం గుండెకాయ వంటిది. ఇలాంటి పోలవరం ప్రాజెక్టుకు జగన్ ఒక శాపంలా మారాడు. చేతకాకపోతే ఇంట్లో ఉండాలి కానీ, రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. కానీ జగన్ క్షమించరాని నేరం చేశాడు.
సముద్రంలో వృధాగా కలిసే 3,000 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోని ఏపీని కరవురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు పోలవరం. ఇది చౌకగా జలవిద్యుత్ అందించే ప్రాజెక్టు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ల జగన్ పాలన వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. పోలవరం ప్రాజెక్టులో 194 టీఎంసీల నీరు నిల్వ చేయొచ్చు. వరద నీటిని కూడా కలుపుకుని 322 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.
దీనిద్వారా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 28.50 లక్షల మందికి తాగునీటిని అందించవచ్చు. అంతేకాదు, పోలవరం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చు. వాటర్ టూరిజం కూడా సాధ్యపడుతుంది. పరిశ్రమలకు నీటి కొరత అనే సమస్యే ఉండదు. పోలవరం అనేది 1941 నుంచి ప్రజల చిరకాల వాంఛగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే వరదలు కూడా నివారింవచ్చు. ఈ ప్రాజెక్టు సాయంతో 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని పక్కకు మళ్లించవచ్చు.
పోలవరంలో డయాఫ్రం వాల్ డెప్త్ 90 మీటర్లు. 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో అతి భారీ గేట్లు ఉంటాయి. 390 కిలోమీటర్ల పొడవైన కుడి, ఎడమ కాల్వలతో నిర్మాణపరంగా ఇది అతి పెద్ద ప్రాజెక్టు. నాడు, టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరంలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపట్టాం. ఈ స్థాయిలో మరే ప్రాజెక్టులోనూ చేపట్టలేదు.
రాష్ట్ర విభజన జరిగాక… పార్లమెంటు సమావేశాలు జరగకముందే, ఢిల్లీలో ఎంతో శ్రమించి 7 ముంపు మండలాలను ఏపీలో కలిపేలా ఆర్డినెన్స్ తెప్పించాం. ముంపు మండలాలు ఏపీలో విలీనం అయ్యాకే ప్రమాణస్వీకారం చేశాను. 2014 నుంచి ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 72 శాతం పనులు పూర్తి చేశాం. రూ.11,762 కోట్ల వ్యయం కాగా… డీపీఆర్-2 కింద రూ.55,548 కోట్ల వ్యయానికి టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది.
కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరంలో జరిగింది నాలుగు శాతం పనులే. వీళ్లు ఖర్చు పెట్టింది రూ.4 ,167 కోట్లే. జగన్ ప్రమాణ స్వీకారం రోజునే పోలవరంలో పనులు నిలిపివేశారు. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయాన్ని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం గుర్తించింది. కాఫర్ డ్యామ్ లో గ్యాప్ లు పూర్తి చేయకపోవడంతోనే డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం వెల్లడైంది. జగన్ ప్రభుత్వం ఆ విషయాన్ని రెండేళ్ల తర్వాత కానీ తెలుసుకోలేకపోయింది.
ఇక, 2019 ఆగస్టు 13న పోలవరం పీపీఏ మీటింగ్ జరిగింది. 2009లో వైఎస్ హయాంలో కాంట్రాక్టర్ ను మార్చడం వల్ల పోలవరం హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి… ఇప్పుడు కాంట్రాక్టర్ ను మార్చడం వల్ల అదే పరిస్థితి తలెత్తుతుందని 2019 నాటి పోలవరం పీపీఏ సమావేశంలో తేల్చారు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టరు పనితీరు బాగుందని, మార్చాల్సిన అవసరం లేదనిఆ సమావేశంలో స్పష్టం చేశారు.
ఇదే అంశాలతో రాష్ట్ర సీఎస్ కు 2019 ఆగస్టు 16న పీపీఏ లేఖ రాసింది. కాంట్రాక్టర్లను మార్చవద్దని సూచించింది. అయినా జగన్ పెడచెవిన పెట్టి కాంట్రాక్టర్ ను మార్చారు. వైఎస్ చేసిన తప్పునే జగన్ కూడా చేశారు. ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మేం 2018 నాటికి డయాఫ్రం వాల్ ను రూ.436 కోట్లతో పూర్తి చేశాం. కానీ జగన్ హయాంలో డయాఫ్రం వాల్ డ్యామేజి అయింది. దాన్ని మరమ్మతు చేయాలంటే రూ.447 కోట్లు ఖర్చవుతుంది. కొత్త డయాఫ్రం వాల్ కట్టాలంటే రూ.990 కోట్లు కావాలి. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ సీపేజీ వల్ల డ్యామ్ పై ఏ పని చేయాలన్నా వీలు కావడంలేదు. సీపేజీ అరికట్టడానికి ఎంత ఖర్చవుతుందో, ఎంత సమయం పడుతుందో అంచనా వేయలేకపోతున్నాం.
జగన్ పోలవరం నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఎకరాకు రూ.19 లక్షల పరిహారం అన్నారు… ఒక్కరికీ ఇచ్చింది లేదు. ఎకరానికి అదనంగా రూ.5 లక్షలు అన్నారు… అదీ లేదు. సకల వసతులతో పునరావాస కాలనీలు అన్నారు… అది సాకారం కాలేదు. మేం కట్టిన పునరావాస కాలనీల్లో మిగిలిన పనులు కూడా వీళ్లు పూర్తి చేయలేదు. నాడు పునరావాసం కోసం మేం రూ.4,114 కోట్లు ఖర్చు పెడితే, వైసీపీ ప్రభుత్వం రూ.1,687 కోట్లు ఖర్చు చేసింది.
దానికితోడు, పోలవరంపై మోసపూరిత ప్రకటనలు చేశారు. మొదట 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు, ఆ తర్వాత 2021 డిసెంబర్ నాటికి అన్నారు, ఆపై 2022 జూన్ నాటికి అన్నారు, మరోసారి ప్రజలను మోసం చేస్తూ 2022 డిసెంబరు నాటికి అన్నారు… ఐదోసారి మరీ దారుణంగా… ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం అన్నారు. వైసీపీ అసమర్థతకు ఈ ప్రకటనలే తార్కాణం. మేం ప్రాజెక్టు అంచనాలు పెంచామని వైసీపీ చేసిందంతా దుష్ప్రచారమేనని పార్లమెంటుగా సాక్షిగా బట్టబయలైంది.
ఈ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టం నన్ను కదిలించివేసింది. ఇకపై కేంద్రం సాయంతో ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళతాం. అంతర్జాతీయ నిపుణులు, దేశీయ ఐఐటీ నిపుణులు, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సవాళ్లను అధిగమిస్తాం… పోలవరం పూర్తి చేస్తాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.