పాతికమంది దివ్యాంగ విద్యార్థులు ఇంటర్ మార్కుల జాబితాలోని ఒక అంశం కారణంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు కోల్పోయే ప్రమాదం రాగా… ఒక చిన్న వాట్సాప్ సందేశంతో వెంటనే స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్ అధికారులతో మాట్లాడి జీవో విడుదల చేయించడం, దాంతో ఇంటర్ మార్కుల జాబితాల ఫార్మాట్ మారడం… ఆ దివ్యాంగ విద్యార్థులు ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పొందడం చకచకా జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో, ఆ 25 మంది దివ్యాంగ విద్యార్థులు నేడు ఉండవల్లి వచ్చి మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. సర్… మీ వల్ల మా ఫ్యూచర్ నిలబడింది అంటూ వేనోళ్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆనందానికైతే అవధుల్లేవు. ఒక్క జీవోతో తమ బిడ్డల భవిష్యత్తు బంగారు బాటలు వేశారంటూ లోకేశ్ కు ధన్యవాదాలు తెలుపుకున్నారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.
“అధికారులతో యుద్ధ ప్రాతిపదికన జీవో.225 విడుదల చేయించడంతో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థల్లో పాతికమంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు సాధించారు. ఆ 25 మంది దివ్యాంగ విద్యార్థులు ఇవాళ వారి తల్లిదండ్రులతో కలిసి ఉండవల్లి నివాసానికి వచ్చి నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ విద్యార్థులందరినీ అభినందించాను. వారికి ల్యాప్ ట్యాప్ లు బహూకరించాను. సింపుల్ గవర్నమెంట్-ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే మా లక్ష్యం అని వారికి వివరించాను” అని నారా లోకేశ్ వివరించారు.