ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. అవసరమైన చోట తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నేడు రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష చేపట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.300 కోట్లు కావాలని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని వివరించారు. ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయాల్సిన రోడ్లు 2,936 కిలోమీటర్ల మేర ఉన్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు… అత్యవసర మరమ్మతుల కోసం వెంటనే టెండర్లు పిలవాలని, ఆలస్యం లేకుండా పనులు ప్రారంభించాని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో రోడ్లను నిర్లక్ష్యం చేశారని… ఈ ఐదేళ్లు ప్రజలు నరకం చూశారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేలా పనితీరు ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.