బీఆర్ఎస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని, ఆ విషయం అధికారపక్షం గుర్తిస్తే మంచిదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు ఆ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో సమవేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్యేల బలం ఉన్నా… లేకపోయినా పార్టీకి కలిగే నష్టం ఏమీ లేదన్నారు. 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు పిడికెడు మంది మాత్రమే ఉన్నారని… వైఎస్ హయాంలో తమ ఎమ్మెల్యేలను లాక్కున్నారని… ఇన్ని ఆటుపోట్లు తట్టుకొని పార్టీ నిలబడిందన్నారు.
గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ తక్కువేమీ చేయలేదన్నారు. ఆయనను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది బీఆరెస్సే అన్నారు. అయినప్పటికీ ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గుండెధైర్యంతోనే ఉన్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తమ పార్టీ కేవలం ప్రజలను, కార్యకర్తలను మాత్రమే నమ్ముకుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డే ఇప్పుడు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఉన్న బలం చాలక విపక్ష ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు.