నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు పోలీసు అధికారులను కర్నూల్ రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు సస్పెండ్ చేశారు.
నందికొట్కూరు రూరల్ సీఐ విజయ భాస్కర్, ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ ఎస్సై ఆర్. జయశేఖర్ లపై వేటు వేస్తూ కర్నూల్ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డిఐజి హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలిక మృతదేహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జూలై 7న ఆడుకోవడానికి వెళ్లిన బాలికను ముగ్గురు మైనర్ బాలురు లైంగిక దాడి చేసి చంపేశారని, మృతదేహాన్ని కేసీ కెనాల్ లో పడేసినట్టు నంద్యాల ఎస్పీ అదిరాజ్ తెలిపారు. తమ పిల్లలు దొరికిపోతారనే భయంతో నిందితులు కుటుంబీకులు బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి పుట్టిలో తీసుకెళ్లి కృష్ణా నదిలో పడేశారని వెల్లడించారు.