ముద్రగడ పద్మనాభం లాంటి రాజకీయ నాయకుడు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రమైన కిర్లంపూడిలో ముద్రగడను అంబటి రాంబాబు కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకున్నందుకు స్వయంగా అభినందించడానికి రావడం జరిగిందన్నారు. కాపు జాతి యువత భవిష్యత్తు కోసం, కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అన్నారు. కాపు జాతి భవిష్యత్తు కోసం రాజకీయంగా ముద్రగడ నష్టపోయారే తప్ప , కాపు కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదన్నారు. కేవలం ఒక సవాల్ ను స్వీకరించి పేరు మార్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ ఒక్కరే అన్నారు. పేరు మారినా ముద్రగడ….. ముద్రగడే అని అందుకే ముద్రగడని కలిసి అభినందించాలని కిర్లంపూడి రావడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ముద్రగడ తో పాటు ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబు, గౌతు స్వామి, గణేశుల రాంబాబు,గణేశుల లక్ష్మణరావు, పెంటకోట నాగబాబు తదితరులు ఉన్నారు.