ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల బాటలో మధ్యప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరం ఉజ్జయినిలో హోటళ్లు, తినుబండారాల స్టాల్స్, తోపుడుబళ్ల నిర్వాహకులు తమ పేర్లను వెల్లడిస్తూ బోర్డులు తగిలించాలని ఆదేశాలు జారీ చేసింది. నేమ్ ప్లేట్ లో యజమాని పేరుతో పాటు క్యూఆర్ కోడ్, ఫోన్ నెంబర్ పేర్కొనాలని చెప్పింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించడంతో పాటు సదరు హోటల్, స్టాల్, తోపుడు బళ్లను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ముస్లింలు తమ లక్ష్యం కాదని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో యాత్ర సాగే మార్గాల్లోని హోటళ్లు, తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. కన్వర్ యాత్ర సాగే మార్గంలో పలువురు హిందూవేతరులు హిందూ పేర్లతో షాపులు నిర్వహిస్తున్నారని, భక్తులకు మాంసాహారంతో చేసిన పదార్థాలను విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదే బాటలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇదేవిదంగా ఆదేశాలు జారీ చేసింది.