పరాకాశం జిల్లా, చీమకుర్తి : ఒంగోలు – కర్నూలు రహదారిలోని చీమకుర్తి మండలం, మర్రి చెట్ల పాలెం, బూదవాడ గ్రామాల వద్ద దెబ్బతిన్న రోడ్డును మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, రహదారులు మరియు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు మరమ్మతు పనుల ఎస్టిమేషన్స్ తదితర వివరాలను ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒక కోటి 70 లక్షలతో రోడ్డు మరమ్మతు పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, లో లెవెల్ లో రోడ్డు వున్నందున సుమారు రెండు అడుగుల మేర లెవలింగ్ చేసి రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సి వుందని ఎస్ఈ దేవానందం కలెక్టర్ కి వివరించారు. జిల్లా ప్రధాన రహదారుల్లో ఒకటైన ఈ రోడ్డు మరమ్మతు పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.