హైదరాబాద్ : మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలకు ఊడిగం చేసింది మీరే కదా అని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ తాను మాత్రం టీడీపీలో ఉండి కూడా తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడానని చెప్పారు. గత ప్రభుత్వం తనను జైలుకు పంపినా భయపడలేదని… నిలబడి కొట్లాడానన్నారు. వాళ్లు అబద్దాలు మానకపోతే తాను నిజాలు చెప్పడం ఆపేది లేదన్నారు.
అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… విద్యుత్ అంశంలో కమిషన్‌ను రద్దుచేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లిందని, కానీ విచారణను ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం చెప్పిందన్నారు. కమిషన్‌ను రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పిందన్నారు.
చైర్మన్ ప్రెస్ మీట్ నిర్వహించారనే అభ్యంతరంపై కోర్టు తమను అడిగిందన్నారు. చైర్మన్‌ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా? అని సుప్రీంకోర్టు తమను అడిగిందన్నారు. చైర్మన్‌ను మార్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పామన్నారు. కమిషన్‌ను రద్దు చేయాలన్న వారి విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిందన్నారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నప్పటికీ ఏడేళ్లు పట్టిందని విమర్శించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టును 2021లో పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కానీ అది ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో రెండేళ్లు పడుతుందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల్లో అవినీతిని తేల్చడానికే తాము కమిషన్‌ను వేశామన్నారు.