రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం సుమారు 7 లక్షల మంది రైతులకు రూ.6 వేల 191 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాగా మొదటి విడతలో 10.83 లక్షల కుటుంబాలకు చెందిన 11.34 లక్షల ఖాతాల్లో రూ.6,035 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
సోనియా, రాహుల్ ఇచ్చిన హామీ మేరకు..
సోనియా, రాహుల్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామన్నారు సీఎం రేవంత్. రూ.లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేశాం అని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లలో పండగరోజు అని చెప్పారు. రైతు ప్రయోజనాలే తమ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ కంపెనీలు రూ. పదేళ్లలో రూ.14 లక్షల కోట్లు ఎగవేశాయని ఆరోపించారు. రైతులు మాత్రం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారని చెప్పారు.