ప్రకాశం జిల్లాలోని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఐడి పార్టీలను రద్దు చేస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ ఉత్తర్వులు జారీ చేశారు. యూనిఫామ్ అనేది పోలీసులకు హుందాతనాన్ని , గౌరవాన్ని ఇస్తుంది. పోలీస్ స్టేషన్లో అనేక కేసుల్లో సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తూ యూనిఫాం లేకుండా డ్యూటీ చేసే ఐడి పార్టీలకు మంచి క్రేజ్ ఉంది. అలాంటి క్రేజ్ కోసం చీమకుర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ మధ్య పోటీ పెరిగింది. ఒక కానిస్టేబుల్ ఏకంగా రాష్ట్ర మంత్రి చేత సిఫార్సు చేయించినట్లు సమాచారం. ఇది జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్ళింది. అందుకని జిల్లా వ్యాప్తంగా ఐడి పార్టీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం అధికారులతో జరిగిన సమావేశంలో మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఐడి పార్టీల రద్దు వ్యవహారంపై జిల్లా పోలీసులలో కలవరం మొదలైంది.