ప్రకాశం జిల్లా / చీమకుర్తి : ఎఎస్సీ వర్గీకరణ చేపట్టాలని గత దశాబ్దాలుగా మాదిగలు చేస్తున్న న్యాయపోరాటంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎస్సీ రిజర్వేషన్ పై ఏబీసీడీ ఉపకులాలుగా చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. సుప్రీం కోర్టు తీర్పుపై ఇంతకాలం వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న ఎమ్మార్పీస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మంద కృష్ణ మాదిగ ఫోటోకి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాటిబండ్ల జకరయ్య, వంశీ, వెంకటేశ్వర్లు, బాబురావు, దావీదు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీలు వెనుకబడిన వారే..
విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6:1తో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తీర్పు వెల్లడించింది.
ఈ వర్గీకరణ అంశం గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మొదలైందని..ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే ఎస్సీలకు అనుకూలంగా తీర్పు రావడం ఆయన గొప్పతనమేనని మంద కృష్ణమాదిగ తెలిపారు. ఆయన కాకుండా సీఎం స్థానంలో మరొకరు ఉండి ఉంటే సాధ్యమయ్యేది కాదని చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పినట్లుగా కోర్టు తీర్పు వెల్లడించడం సంతోషంగా ఉందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెల్లడైన వెంటనే ఇదే అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణపై అన్నీ రాష్ట్రాల కంటే తామే ముందుగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.