పల్నాడు జిల్లా / కారంపూడి : రాష్ట్రంలోనే ఎంతో ప్రాముఖ్యత సంచరించుకున్న కారంపూడి. బస్టాండ్ చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా మారింది. కొన్నేళ్లుగా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు కనీసం బస్ స్టాండ్ సౌకర్యంలేక ఎంతో ఇబ్బందులు పడ్డారు. నాటి ప్రభుత్వాలు గాని, నాయకులుగాని పట్టించుకోలేదు. ప్రజల కష్టాలను గుర్తిచిన నర్రా వెంకటసుబ్బయ్య పెద్దమనసు చేసుకొని వారి కుటుంబ పెద్దల గుర్తుగా తన స్వంత భూమిని ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం కోసం దానం చేసారు. 1993 లో ఆర్టీసీ వారు బస్ స్టేషన్ నిర్మాణం చేశారు. పిడుగురాళ్ల డిపో ఆధీనంలో కొన్నాళ్ళు సాగిన బస్ స్టాండ్ తిరిగి మూతపడింది.
రిపోర్టర్ టీవీ ప్రత్యేక కథనం …
అధికారులు పట్టించుకోకపోవడంతో బస్టాండ్ ఆలనా, పాలన కరువై శిథిలావస్థకు చేరుకొని ప్రయాణ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. గతంలో బస్టాండ్ ఆవరణ సీసీ చేయకపోవడంతో వర్షాకాలంలో ప్రయాణికులు రావాలంటే నరకయాతన పడ్డారు. బస్టాండ్ నిర్మాణం చేపట్టి సుమారు 23 సంవత్సరాలకే బస్టాండ్ ఆయుష్షు కోల్పోయింది. బస్టాండ్‌పై కప్పు పెచ్చులూడి ప్రయాణికుల మీద పడే అవకాశాలున్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో రాత్రుళ్లు మందుబాబులు లోపలికి చొరబడి మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవించి ఖాళీ బాటిళ్లను సైతం అక్క డ పడవేసి వెళుతున్నారు. రాత్రుళ్లు అసాంఘిక కార్యక్రమాలు జరుగు తుంటే ప్రశ్నించే నాధుడే లేడు.
ఒకప్పుడు పొదిలి, ఒంగోలు, వినుకొండ నుండి హైదరాబాదు కి బస్ సర్వీసులు వెళ్లాలంటే కారంపూడి మీదుగానే వెళ్ళాలి. అలాగే నర్సారావు పేట నుండి మాచర్ల, పిడుగురాళ్ల నుండి మాచర్ల వయా కారంపూడి. కారంపూడి నుండి గురజాల, దాచేపల్లి ఇలా చెప్పుకుంటూ పొతే అనేకం. కాలక్రమేణా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బస్ స్టాండ్ మూతపడింది.
ఇకనైనా స్థానిక నాయకులు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు ,ఆర్టీసీ పాలకులు, అధికారులు స్పందించి బస్టాండ్ మరమ్మతులు చేపట్టి, కనీస సౌకర్యాలు చేపట్టి సీసీ పనులు త్వరితగతిన చేపట్టి కారంపూడి బస్ స్టాండ్ ని పునఃప్రారంభించాలని రిపోర్టర్ టివి ఎపి డైరెక్టర్ శ్యాంప్రసాద్, స్థానికులు కోరుతున్నారు.