ముంబయిలోని మలద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు రూ.21 లక్షల విలువైన సొత్తును దోచుకున్నారు. 60 ఏళ్ల వృద్ధురాలు ఓ అపార్ట్ మెంట్లో నాలుగో ఫ్లోర్ లో నివాసం ఉంటోంది. పుట్టినరోజు సందర్భంగా స్నేహితురాలితో కలిసి మహాలక్ష్మి ఆలయం, ముంబాదేవి ఆలయాల సందర్శనకు వెళ్లింది. ఇదే అదనుగా తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లారు.
ఆమె ఇంటికి వచ్చి చూసే సరికి తలుపు విరగ్గొట్టి ఉంది. 32 అంగుళాల టీవీ, వజ్రాభరణాలు, ముత్యాల నగలు చోరీకి గురైనట్టు గుర్తించింది. దాంతో లబోదిబోమన్న ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న మలద్ పోలీసులు ఈ కేసును ఓ సవాలుగా తీసుకున్నారు. డీసీపీ విశాల్ ఠాకూర్, సీనియర్ ఇన్ స్పెక్టర్ ధనంజయ్ లిగాడే ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు.
సీసీటీవీ ఫుటేజి పరిశీలించగా, దొంగలు ఓ క్యాబ్ లో పరారైన విషయం వెల్లడైంది. ఆ క్యాబ్ నెంబరు స్పష్టంగా కనిపించకపోయినా, ఆ క్యాబ్ కాస్త విభిన్నమైన గుర్తులు కలిగి ఉంది. దీని ఆధారంగా పోలీసులు అనేకమంది ట్యాక్సీ డ్రైవర్లను ప్రశ్నించారు. చివరికి ఆ క్యాబ్ ఘట్కోపర్ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. ఆ క్యాబ్ సొంతదారు కుమారుడు నౌషాద్ ఖాన్ పై కొన్నిరోజులు నిఘా ఉంచిన పోలీసులు… వృద్ధురాలి ఇంట్లో దోపిడీకి పాల్పడింది అతడికి సంబంధించిన ముఠానే అని నిర్ధారించుకున్నారు. ఆపై అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.