తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం స్థానిక వెలుగు కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ మండల సర్వసభ్య సమావేశంకు ముఖ్యఅతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. మండల అధికారులు ఒక్కొక్కరుగా పరిచయం చేసుకుంటూ వారి ప్రభుత్వ పథకాలను వివరించారు. అభివృద్ధికి కావలసిన పలు విషయాలపై చర్చించారు. అధికారులు గత ప్రభుత్వంలో మొదలుపెట్టి పూర్తిగాని పనుల గురించి ప్రస్తావించారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ, ఎలక్ట్రికల్, వైద్య సిబ్బంది, వైద్యులు, ఎక్సైజ్, పసు సంవర్ధక, ఆర్టీసీ, ఆర్అండ్ బి, విద్యుత్,పోలీసులు పలు శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని మండలంలోని సమస్యలను, పెండింగులో ఉన్న పనులను,జరుగవలసిన అభివృద్ధి గురించి వివరించారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన పలు వాగ్దానాలు వాటి పరిష్కార దిశగా అధికారులు అడుగులు వేయాలని అంతేకాకుండా ఎన్నికలకు ముందు మాత్రమే రాజకీయం…ఆ తరువాత నియోజకవర్గ అభివృద్ధి నాకు ముఖ్యం అని ఎమ్మెల్యే నాని స్పష్టం చేశారు. అధికారులు, నాయకులు తెలిపిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వాటి నిధుల సేకరణ కొరకై ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తి చేసినట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత వ్యయం అవసరమో అంచనా వేయాలని అధికారులను కోరారు. పార్టీలకు కులమత వర్గాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపరచాలని, కనీస మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని దిశానిర్దేశం చేసారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.