భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఆదివారం బంద్ పేరుతో తెలంగాణ స్టేట్ కమిటీ మావోయిస్టు పార్టీ సాయుధ అజ్ఞాత దళాలు రక్షణ బలగాలపై, ప్రజాప్రతినిధులపై ఆకస్మిక దాడులు చేయడానికి నిర్ణయించుకున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందినది. ఇందులో భాగంగానే కొన్ని మావోయిస్ట్ బృందాలు చర్ల ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి మరియు ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టడానికి సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చర్ల ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువగా సంచరించే అనుమానిత ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పూసుగుప్ప అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీలకు మరియు మావోయిస్టులకు సుమారుగా 20 నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. అనంతరం కాల్పులు జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించడం జరిగింది. ఘటనా ప్రదేశంలో 01 ఎస్ బి బి ఎల్ తుపాకీ, 01 పిస్టల్ మరియు రెండు కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఇంకా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.