తెలంగాణలో త్వరలో ‘కలెక్టర్’ పేరు మారబోతోంది. భూమి శిస్తు వసూలు చేసే వారి నుంచి చాలామందిని కలెక్టర్లుగా వ్యవహరిస్తుండడంతో ఈ పేరును మార్చి ఇకపై జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)గా పిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ వ్యవస్థలో కీలక సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లా పాలనాధికారికి ప్రస్తుతం వ్యవహరిస్తున్న కలెక్టర్ అనే పేరు సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టాలని, కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాలో ఈ అంశాన్ని చేర్చాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం.
నిజానికి ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కలెక్టర్‌ను జిల్లా మేజిస్ట్రేట్‌గానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోనూ కలెక్టర్లను డీఎంలుగానే వ్యవహరించాలని నిర్ణయించింది. అదనపు కలెక్టర్ల పోస్టులలోనూ పలు మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జాయింట్ కలెక్టర్ (జేసీ) పేరును, స్థాయిని ప్రభుత్వం మార్చింది. ఇందులో భాగంగా జేసీ స్థానంలో ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించింది. ఇకపై, వారి హోదా ముందు కూడా ‘కలెక్టర్’ అదృశ్యం కానుంది. వారిని కూడా ఇక నుంచి అదనపు జిల్లా మేజిస్ట్రేట్లుగా పిలిచేలా చట్టంలో మార్పులు చేయనున్నారు. అలాగే, మండలస్థాయిలో తహసీల్దార్ పేరుతోపాటు మరిన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్ పేరును మార్చి భూ నిర్వహణ అధికారి, లేదంటే భూ మేనేజర్‌గా వ్యవహరించే అంశాన్ని పరిశీలిస్తోంది.