తిరుపతి జిల్లా , పాకాల మండలం కావలివారిపల్లె లో పశువుల పందేలుగా పేరు గాంచిన జల్లికట్టు పల్లెవాసుల సంబరాలు చేసుకున్నారు. జల్లికట్టు గ్రామీణ క్రీడలలో ప్రధానమైనది. వ్యవసాయంలో తమతో పాటు శ్రమను పంచుకునే పశువులకు మంచినీటితో స్నానాలు చేయించి, కొమ్ములను చివ్వి, రంగులు వేసి, కుప్పెలు తొడిగి, చక్కగా అలంకరించి, బహుమతులను కట్టి, పోటీలు పెట్టేవారు. ఇలాంటి సంబరాలను ఆదివారం చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, కావాలివారిపల్లెలో కనువిందుగా నిర్వహించారు. ఈ జల్లికట్టు సంబరాలకు చంద్రగిరి ఎంయల్ఏ పులివర్తి నాని తనయుడు వినీల్ సాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన వినీల్ కి యువత బాణా సంచా పేల్చుతూ, మహిళలు మంగళ హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు. పశువుల దొడ్ల వద్ద వినీల్ కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి పశువుల పందేలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినీల్ మాట్లాడుతూ జల్లికట్టు యువతలో ఎంతో హుషారు కలిగించిందన్నారు. ఇలాంటి సంబరాలు జరుపుకోవడం వలన పల్లెలకు వర్ణించలేని కోలాహలంతో పాటు, ఆహ్లాదం కలుగుతాయని చెప్పారు. జల్లికట్టు వలన మరుగున పడిపోతున్న గ్రామీణ పండుగ సంబరాలను భావితరాలకు అందించ వచ్చని తెలియజేశారు. జల్లికట్టును తిలకించడానికి, పశువులను నిలువరించి , బహుమతులను చేజిక్కించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి వేలాదిగా యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, యువత, అభిమానులు పాల్గొన్నారు. పిలవగానే మాట మన్నించి పశువుల పండుగకు విచ్చేసిన పులివర్తి వినీల్ కు గ్రామస్తులు పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.