భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల మళ్ళీ గోదావరి వరద పెరుగుతుంది. ఇప్పటికే మూడోవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. కాళేశ్వరం నుంచి భారీగా వరద వస్తుంది.ప్రస్తుతం భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 52.90 అడుగులకు వద్ద గోదావరి నీటిమట్టం చేరుకోగా ఇంక పెరిగే అవకాశం మెండుగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.ఈ నెల 13 నుంచి ప్రారంభమైన వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. నాలుగు రోజుల క్రితం ఆగస్టు 16 వ తేదీన 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 17వ తేదీ రాత్రి వరకు 61.6 అడుగుల గోదావరి చేరి ఆ తర్వాత శాంతించినట్లే అనిపించింది. ఇదిలా ఉంటే మళ్లీ గురువారం ఉదయం నుంచి ఒక్కసారిగా గోదావరి పెరగడం ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి, రెండవ, ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే భద్రాచలం, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు సైతం వరద ఉధృతి పెరిగింది. అదే విధంగా దిగువన ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని వి.ఆర్.పురం, చింతూరు, కూనవరం మండలాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. మరో వైపున నుంచి కిన్నెరసాని నుంచి 70 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. వరద ముంపు నేపధ్యంలో భద్రాచలం నుంచి కొత్తగూడెం, కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్లే రహదారిని మూసివేశారు.