- ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
- వ్యక్తి నుంచి రూ. 8 లక్షల లంచం డిమాండ్
ఉన్నత హోదాలో కొనసాగుతూ ఆదర్శంగా ఉండాల్సిన కొందరు ప్రభుత్వ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. లంచం తీసుకోవటం నేరమని తెలిసినా.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నాచితక ఉద్యోగులే కాదు..పై స్థాయి ఉద్యోగులు సైతం లంచాలకు మరుగుతున్నారు. తాజాగా.. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం కలకలం రేపుతోంది. గత రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షల లంచం తీసుకుంటూ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు సమీపంలో డబ్బులు కారులో పెట్టుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. జక్కిడి ముత్యంరెడ్డి అనే వ్యక్తి తనకున్న 14 గుంటల భూమిని ధరణి వెబ్ సైట్‌లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి తొలగించాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే అందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మెహన్ రెడ్డి రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముత్యంరెడ్డి నుంచి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలవేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అయితే అడ్డంగా దొరికిపోయిన మదన్.. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి పేరు తెరపైకి తీసుకొచ్చాడు. జాయింట్ కలెక్టర్ చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పాడు. దాంతో తమ ముందే ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్‌కు ఫోన్ చేయించారు.. మదన్ మోహన్ జాయింట్ కలెక్టర్‌కు ఫోన్ చేసి తాను ముత్యం రెడ్డి డబ్బులు తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో ఆ డబ్బును తీసుకొని పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు జాయింట్ కలెక్టర్ ఫోన్‌లో మదన్ మోహన్‌కు సూచించాడు.
అప్పటికే అక్కడ కాపు కాసిన ఏసీబీ అధికారులు పెద్ద అంబర్‌పేట వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి మదన్ మోహన్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాగోల్‌లోని భూపాల్ రెడ్డి నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. అక్కడ కూడా కొంత మెుత్తంలో డబ్బు దొరికినట్లు తెలిసింది. ఈ మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.