హైదరాబాద్ పోలీసులు ఓ కేసును గంటలోనే ఛేదించారు. దీంతో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడగలిగారు. టెక్నాలజీ సహాయంతో వారు ఈ కేసును అత్యంత వేగంగా పరిష్కరించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్ప నగర్‌కు చెందిన మాలంపాక బాబీ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
సోమవారం మధ్యాహ్నం తాను డ్యూటీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చాడు. కానీ ఆ తర్వాత తన బావమరిదికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి… ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బావమరిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందిన వెంటనే జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ స్పందించారు. అతని మొబైల్ సిగ్నల్‌ను ట్రేస్ చేశారు. సికింద్రాబాద్ మహంకాళీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. సిబ్బందిని అక్కడకు పంపించారు. ఓ లాడ్జిలో బాబీని గుర్తించారు. అప్పటికే అతను దోమలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.