భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలను ఎంతో సంబరంగా జరుపుకోవడానికి 140 కోట్ల మంది ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. దేశ గౌరవం, ఐక్యతను చాటే ఈ వేడుక మనకందరికీ గర్వకారణమన్నారు.
ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆర్థిక, క్రీడా, మౌలిక వసతుల కల్పన రంగాల్లో దేశం సాధించిన విజయాలను ఆమె ప్రశంసించారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఎందరో పోరాటాలు చేసిన ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఆగస్ట్ 14వ తేదీ దేశవిభజన నాటి పీడకలను స్మరించుకునే రోజు అన్నారు. దేశ విభజన సమయంలో వేలాదిమంది బలవంతంగా దేశం విడిచి వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని… ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం గిరిజనులు చేసిన పోరాటాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకొంటున్నామని, వచ్చే ఏడాది ఆయన 150వ జయంత్యుత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య సమరయోధులకు నివాళిగా కొత్త క్రిమినల్ చట్టాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత కొన్నేళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో ఎంతో పురోగతి సాధించామన్నారు. నూతన జాతీయ విద్యావిధానం ఫలితాలను ఇస్తోందన్నారు.