సంగారెడ్డి జిల్లా / పఠాన్ చేరు : పఠాన్ చేరు పట్టణంలో జనావాసాల మధ్య గల ప్రభుత్వ హెచ్ పి గ్యాస్ గోదాం భవనాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే జిఎంఆర్ భేటీ అయ్యారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పటాన్చెరు పట్టణంలో గ్యాస్ గోదాం భవనం వరకు విస్తరణ జరుగుతుందని, దీంతో పాటు గోదాం పక్కనే గల పాత తహసిల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు కాబోతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిత్యం వందలాదిమంది ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తారని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మండల పరిధిలోని రామేశ్వరం బండ శివారులో గ్యాస్ గోదాం కి స్థలాన్ని కేటాయించి తరలించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి సూచనల మేరకు.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ ను కలిసి ప్రతిపాదన అందజేశారు.