ప్రకాశం జిల్లా / చీమకుర్తి : చీమకుర్తిలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో లేడీ ట్రైనీ డాక్టర్ పై ఈ నెల 9వ తారీఖున జరిగిన అత్యాచార ఘటనకు యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురైంది.
మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, వైద్యులు, ఫార్మసిస్టులు ఇంకా అనేక సంఘాల వారు దేశవ్యాప్తంగా వారి యొక్క సంఘీభావం తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడే విధంగా బాధిత మహిళా కుటుంబానికి న్యాయం జరిగే విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు.
అందులో భాగంగా శనివారం చీమకుర్తి పట్టణంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు, మెడికల్ షాపుల యాజమాన్యాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్ల విద్యార్థులు కూడా తమ సంఘీభావం తెలిపారు. భారీ ర్యాలీగా ప్లకార్డులతో తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది తమ నిరసనను మీడియా ముఖంగా వ్యక్తం చేశారు. జవహర్ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ బి.జవహర్ మాట్లాడుతూ డాక్టర్లపై, మహిళలపై జరిగే అత్యాచారాలను, దాడులను అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చట్టాలను తీసుకొని రావాలని, విచారణలో గాని, శిక్ష అమలులో గాని ఎటువంటి జాప్యం ఉండకూడదని చెప్పారు .
మహిళలపై జరిగే అత్యాచారాలకు త్వరితగతిన శిక్ష అమలు చేస్తే తప్ప మీనమేషాలు లెక్కపెట్టి శిక్షిస్తే ఇంకా క్రైమ్ రేట్ పెరగడమే తప్ప తగ్గేది లేదని తీవ్రంగా మండిపడ్డారు.
బాధిత మహిళ ను తిరిగి తీసుకుని రాలేం కాబట్టి, వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి, రానున్న రోజుల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు త్వరితగతిన విధించాలని ప్రభుత్వాలను మీడియా ముఖంగా కోరారు.
ఈ కార్యక్రమంలో చీమకుర్తి పట్టణ ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య సిబ్బంది, స్థానికులు మాజీ మున్సిపల్ చైర్మన్ కౌత్రపు రాఘవరావు, ముత్యాల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.