జగిత్యాల జిల్లా / మెట్ పల్లి : రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో రైతులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని అర్హులైన అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల రైతులు ధర్నాలో పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని ఇవ్వాలని నినాదాలు చేశారు. 2 గంటలపాటు జరిగిన ధర్నా వల్ల అయిదు కిలోమీటర్ల మేరా వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. పోలీసులు చేరుకొని జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడించి ధర్నానువిరమింపజేశారు.
ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేయాలని కోరారు. రేషన్ కార్డ్ ప్రామాణికంగా తీసుకొకుండా అర్హులైన రైతులందరికీ భేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా రైతులకు రావాల్సిన రుణమాఫీపై గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. రైతు రుణమాఫీ కోసం 31 వేల కోట్లు కేటాయించామని చెప్పిన ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేయాలని, 2 లక్షలు దాటినా రుణాలపై రైతులము బ్యాంకర్లతో మాట్లాడుకుంటామని అది ప్రభుత్వానికి ఏమి సంబంధమని, ప్రభుత్వం చేయాల్సింది చేయాలని కోరారు.