ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన పట్ల మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూలు ఎస్పీకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద లేఖ రాశారు. నిందితులపై తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
కొండారెడ్డిపల్లెలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం నేరెళ్ల శారదను కలిశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. తమపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారంటూ ఈ జర్నలిస్టులు గురువారం స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి వీరిద్దరు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 150 మంది తమను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మీకేం పని అంటూ తమపై దౌర్జన్యానికి దిగారని ఆ జర్నలిస్టులు తెలిపారు. తాము రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలకు సంబంధించిన మెమొరీ కార్డులను లాక్కున్నారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మహిళా కమిషన్‌కు వినతిపత్రం అందించారు.