తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి నేడు ఢిల్లీలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ రోలోసింగ్ తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే అయిదు నగరాలలో సిజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లు ఉన్నాయని కొత్తగా తిరుపతి నగరంలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కానుందని ఆమెకి దృష్టికి తీసుకెళ్లారు.
వెల్నెస్ సెంటర్లలో మొత్తం 23,326 మంది కార్డ్ హోల్డర్లు ఉన్నారని 56,951 లబ్దిదారులుగా నమోదు చేసుకున్నారని, పదవీ విరమణ కారణంగా లబ్ధిదారుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆమెకి వివరించారు.
రాష్ట్రాల పునర్విభజన తర్వాత కూడా, వెల్నెస్ సెంటర్లను తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిజీహెచ్ఎస్ హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ నియంత్రణ, పర్యవేక్షణలోనే ఉన్నాయని ఆమెకి తెలియజేసారు.
శస్త్ర చికిత్సలు, ప్రత్యేక చికిత్స, బిల్లుల రీయింబర్స్మెంట్, మందుల జారీకి సంబంధించిన అన్ని అనుమతులు సిజీహెచ్ఎస్ హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ పరిధిలోని అంశాలు కావడం ఆంధ్రప్రదేశ్ వెల్నెస్ సెంటర్లకు హైదరాబాద్ నగరం దూరంగా ఉండటంతో పలు రకాల అనుమతులు, మందులు మొదలైన వాటిని పొందడంలో జాప్యానికి కారణమవుతోందని రోలోసింగ్ కి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ వెల్నెస్ సెంటర్ల పర్యవేక్షణ, పరిపాలన, కార్యకలాపాల కోసం రాష్ట్రానికి అడిషనల్ డైరెక్టర్ అవసరం ఉందని డైరెక్టర్ జనరల్ దృష్టికి తీసుకెళ్లానని, ఈ విషయాన్నీ పరిశీలించి తగు చర్యలు చేపడతామని ఆమె తెలియజేసారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.