Hyderabad Hydra AV Ranganath : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్న పేరు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా కబ్జాలకు పాల్పడి కట్టడాలు నిర్మించిన వారికి రంగనాథ్ పేరు వింటేనే చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు తమ అక్రమ ఆస్తుల మీద పడి కూల్చేస్తాడోననే భయంతో వణికిపోతున్నారు. అనుమతి లేని, కబ్జా చేసిన స్థలం లేదా చెరువులను ఆక్రమించిన కట్టడం ఏదైనా సరే దానిని నేరుగా కూలగొట్టడమే హైడ్రా చేస్తున్న పని. కాగా హైడ్రా చీఫ్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌కు పవర్ ఫుల్ ఐపీఎస్‌గా పేరుండటంతో తలలు పట్టుకుంటున్నారు. గతంలో మార్కాపురం, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్‌ను అణిచివేయడంలో తమ స్పెషల్ మార్క్ చూపించారు రంగనాథ్. ఇప్పుడు రంగనాథ్ పవర్ తెలిసిన అక్రమార్కులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరుతుందని రేవంత్ సర్కార్ కూడా బలమైన నమ్మకంతో ఉంది.
నల్గొండ జిల్లాకు చెందిన ఆవుల వెంకట రంగనాథ్ 1996లో గ్రూప్-1లో టాప్ ర్యాంక్ సాధించి పోలీస్ బాస్ కావాలనే కలతో డీఎస్పీ ఆప్షన్ ఎన్నుకున్నారు . మొదటి పోస్టింగ్ లోనే 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా విధులు నిర్వహించారు. నల్టొండలో ఉన్నప్పుడే డీఐజీగా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ లో జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్)గా విధులు నిర్వర్తించిన రంగనాథ్ ఆ తర్వాత వరంగల్ పోలీసు కమిషనర్‌గా ఎన్నికయ్యారు. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే అది సాధించేవరకూ చిత్త శుద్ధితో పనిచేయడం తన నైజంగా రంగనాథ్ చెబుతుంటారు. అదే ఆత్మవిశ్వాసంతో తాను గ్రూప్-1 ఆఫీసర్‌గా విజయం సాధించానని, ఏదైనా పనిని ఒక ప్రణాళిక ప్రకారమే చేస్తానని చెబుతున్నారు. అయేషా, అమృత ప్రణయ్ కేసులోనూ రంగనాథ్ తన ప్రత్యేకత చాటుకున్నారు.
నిజాయితిగల ఆఫీసర్ అంటూ జనం జేజేలు..
అయితే గత ప్రభుత్వం తమకు మద్ధతుగా ఉన్న బడా బాబులు, వ్యాపారవేత్తలు, సినీనటుల అక్రమ కట్టడాలకు అడ్డు చెప్పకపోగా అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చిందని జనాలు వాపోతున్నారు. పార్టీఫండ్స్ కోసం కొంతమంది భూ కబ్జాలను చూసిచూడనట్లు వవ్యహరించడమే కాకుండా పేదల కట్టడాలను కూల్చి నీడ లేకుండా చేశారంటున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ రేవంత్ సర్కార్ అలా చేయకుండా ముందుగా అవినీతిపరుల ఆటకట్టిస్తోందని, రంగనాథ్ లాంటి నిజాయితిగల ఆఫీసర్ ఉండటం స్వాగతించాల్సివిషయమంటూ రంగనాథ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రంగానాథ్ హీరో, జీహెచ్ఎంసీ జీరో అంటూ సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదులు అందినప్పటికీ కూల్చివేతలకు బ్రేక్ పడింది. కానీ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ కు సీఎం రేవంత్ ఫుల్ రైట్స్ ఇవ్వడంతో తనదైన ముద్ర వేసేందుకు రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు. ఎంతటివారైనా సరే వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని, సినీ ప్రముఖుల కట్టడాలను కూల్చే దిశగా దూసుకెళ్తున్న రంగనాథ్ కు జనం జేజేలు కొడుతున్నారు. రంగనాథ్ లిస్టులో మరింత మంది రాజకీయ, సినీ, వ్యాపారాలకు సంబంధించిన బడా బాబులున్నట్లు తెలుస్తోంది.