తిరుపతిలో ఇంటర్ మోడల్ బస్టాండ్ నిర్మించేందుకు కార్యాచరణ వేగవంతం అయ్యింది. నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి వేగవంతం చేయాలని కోరుతూ గత వారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తిరుపతి ఎంపీ డా. గురుమూర్తి కలిసి చర్చించిన తరువాత త్వరిత గతిన పనులు మొదలయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేడు నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజా మిశ్రా తిరుపతి విచ్చేశారు. తిరుపతి బస్టాండులో సమీక్షా సమావేశం నిర్వహించిన పిదప బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించి వివరాలను తెలుసుకొన్నారు. అనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ మల్టి మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులు వైఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లోని గత ప్రభుత్వ హయాంలోనే అన్ని అనుమహులు వచ్చాయని కానీ బస్టాండ్ డిజైన్ లలో కొన్ని మార్పులు కోరడంతో అవి సిద్ధం అయ్యేలోగా ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ పక్రియ ఆగిందని అన్నారు. ఇంటర్ మోడల్ బస్టాండ్ నిర్మాణం భవిష్యత్ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతనంగా నిర్మిస్తున్నారని అన్నారు. ఈ నిర్మాణాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండనున్నాయని ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా బస్ టెర్మినల్, వాణిజ్య సముదాయాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ని అనుసంధానం చేస్తూ స్కై వాక్, డార్మెటరీలు, ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ చేసేందుకు అనుకూలంగా ఛార్జింగ్ స్టేషన్ మొదలగు సౌకర్యాలతో రూపుదిద్దుకోనుందని ఆయన తెలియజేసారు. ఈ నిర్మాణానికి సంబంధించి ఏవైనా పరిపాలన అనుమతులు అవసరమైన పక్షంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించినట్లయితే టెండర్లు పూర్తయి త్వరలో పనులు మొదలవుతాయని ఎంపీ డా. గురుమూర్తి తెలియజేసారు.