ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు గారు 25వ తారీకు అనగా ఆదివారం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఆయన స్వగ్రామం నాగులప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామం. ఆంధ్ర విశ్వవిద్యాలయం లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. ఎల్ఎల్బీలో గ్రాడ్యుయేషన్ చేశారు.
ఆయన రాజకీయ ప్రస్థానం 1987లో తెలుగుదేశం పార్టీలో మొదలైంది. మండల ప్రజా పరిషత్ సభ్యునిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పలు పదవులను పొందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999 లో సంతనూతలపాడు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మొదటిసారి శాసనసభ్యులయ్యారు.
2004 సార్వత్రిక ఎన్నికలలో రెండోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సంతనూతలపాడు నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2009 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.
2010 సంవత్సరం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రకాశం జిల్లాఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
2016 వ సంవత్సరంలో ఎర్రగొండపాలెం శాసనసభ్యునిగా ఉన్న సమయంలో మరలా అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.
అనారోగ్య కారణాలవల్ల 2019 సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
గత ఆరు నెలలుగా ఆరోగ్య పరిస్థితులు బాగా లేనందువలన 2024 సార్వత్రిక ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో వారి కుమారుడు పాలపర్తి విజేష్ రాజ్ సంతనూతలపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు .
అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా చికిత్స పొందుతూ ఆదివారం హైదరాబాదులోని అపోలో ఆసుపత్రి నందు వారి తుది శ్వాస విడిచారు.